Delhi High Court: కేజ్రీవాల్ అరెస్ట్‌తో ఆప్ ప్రభుత్వం స్తంభించింది: ఢిల్లీ హైకోర్టు

  • ఆప్ ప్రభుత్వంపై మరో తీవ్ర విమర్శలు గుప్పించిన న్యాయస్థానం
  • ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి 24 గంటలపాటు అందుబాటులో ఉండాలని వ్యాఖ్య
  • ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలకు ఇంకా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ చేరలేదంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఆగ్రహం
Delhi High Court says AAP Government At A Standstill After Arvind Kejriwal Arrest

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అనంతరం ఆప్ ప్రభుత్వం స్తంభించిందని ఢిల్లీ హైకోర్ట్ వ్యాఖ్యానించింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ పాఠశాలలు పున:ప్రారంభానికి సిద్దమవుతున్నా ఎలాంటి సదుపాయాలు లేవని, పుస్తకాలు, యూనిఫామ్స్ పంపిణీకి ఇంకా చర్యలు తీసుకోలేదంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్య చేసింది. దేశ రాజధాని ఢిల్లీకి సీఎం అంటే నామమాత్రంగా ఉండడం కాదని, 24 గంటలపాటు అందుబాటులో ఉండాల్సిన అత్యంత ముఖ్యమైన పదవి అని పేర్కొంది. సీఎం అందుబాటులో లేని కారణంగా పిల్లలకు ఉచిత పాఠ్య పుస్తకాలు, మెటీరియల్, యూనిఫామ్‌లను దూరం చేయడం తగదని హైకోర్ట్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 

దేశ ప్రయోజనాలు, ప్రజాప్రయోజనాల దృష్ట్యా సీఎం పదవిలో ఉన్న వ్యక్తి ఎక్కువ కాలం అజ్ఞాతంలో ఉండకూడదని ఢిల్లీ హైకోర్ట్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరాలతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌కు తాము ఏదైనా ఆర్థిక వనరుల సాయం చేయాలంటే అందుకు ముఖ్యమంత్రి సమ్మతి అవసరమని ఢిల్లీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ చెప్పడంతో కోర్టు ఈ మేరకు స్పందించింది. ముఖ్యమంత్రి అరెస్టు అనంతరం ఢిల్లీ ప్రభుత్వం నిలిచిపోయిందని పేర్కొంది.

కాగా పరిపాలనాపరమైన అడ్డంకుల కారణంగా విద్యా సంవత్సరం ప్రారంభంలో దాదాపు రెండు లక్షల మంది విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేవని, పుస్తకాలు, యూనిఫామ్స్ ఇంకా పాఠశాలలకు చేరలేదంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌పై ఏప్రిల్ 26న విచారణ ఆరంభమైంది. ఆ రోజు కూడా కేజ్రీవాల్‌పై కోర్టు మండిపడింది. జైలులో ఉండి కూడా రాజీనామా చేయకపోవడంపై స్పందిస్తూ.. కేజ్రీవాల్‌కు దేశ ప్రయోజనాల కంటే స్వార్థ ప్రయోజనాలే ఎక్కువని తీవ్రంగా విమర్శించిన విషయం తెలిసిందే.

More Telugu News